నటుడు పృథ్వీరాజ్ కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్నారు. ఆమె విజయవాడలో ఉంటుంటే, ఈయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. పృథ్వీపై ఆమె పెట్టిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి. కాగా తన జీవితంలోని మరో స్త్రీ ఎవరనేది తొలిసారిగా బయటపెట్టారు పృథ్వీ. లేటెస్ట్‌గా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 20 ఏళ్లుగా తన బాగోగులు ఓ స్త్రీ చూసుకుంటున్నారనీ, ఆమె పేరు దాసరి పద్మరేఖ అనీ ఆయన వెల్లడించారు.
"2020లో నన్ను పలకరించిన వాళ్లెవరూ లేరు. ఒకవైపు లాక్‌డౌన్. సినిమాలు లేవు. బయటేమో ఉగ్రవాద శిబిరాల నుంచి మనకు కోట్లు వచ్చాయని ప్రచారం. సెంటర్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లి టిఫిన్ చేసేవాడ్ని. భోజనం కూడా అక్కడే. మిగతావాళ్లు ఎలా సంపాదించుకున్నారో నాకు తెలీదు. 'లౌక్యం' సినిమాలో యాక్ట్ చేశాను కానీ, నాకు లౌక్యం లేదు. ఆడా, మగా కలిస్తే వేరే రకమైన రిలేషన్ అంటగట్టేస్తుంటారు. హైదరాబాద్‌లో ఒకామె 20 ఏళ్ల నుంచీ నా బాగోగులు చూసుకుంటూ వస్తున్నారు. నా లైఫ్‌లో కొన్ని ఘటనలు జరిగినప్పుడు నా పక్కనే ఉండి, నాకు డబ్బులిచ్చి, తన పిల్లలతో పాటు నన్నూ ఓ పిల్లాడిలా చూసి, ఆదరించారు. ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఇప్పుడు నేను బతికున్నానంటే కారణం ఆమే. త్వరలో ఆమె ఎవరనేది రివీల్ చేస్తాను." అని ఆయన అన్నారు.
"ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆమె నన్ను తీసుకెళ్లి, తన పిల్లల మధ్యలో నన్ను పెట్టి, తన బంధువుల నుంచి ఎన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నా, ఈ ఫ్రెండ్‌ను బతికించాలన్న ఉద్దేశంతో నన్ను చూసింది. కొవిడ్ అప్పుడు కూడా హాస్పిటల్‌లో జాయిన్ అయితే, తెల్లవారుజాము 4 వరకు అక్కడే ఉండి చూసుకుంది. దాన్ని వేరే రిలేషన్ కింద జనం చూస్తుంటే, నేనామెతో 'పుకార్లవుతున్నాయో, షికార్లవుతున్నాయో.. వాటన్నింటిని పక్కన పెట్టేసేయండి. వీటికి 2023లో సరైన సమాధానం చెబుదాం. అన్నీ మంచి జరుగుతున్నాయ్.' అని చెప్పాను. అని తెలిపారు పృథ్వీ.
"ఇప్పుడు సందర్భం వచ్చింది కదా.. చెప్పండి".. అని ఆర్కే అనడంతో, "ఆమె పేరు దాసరి పద్మరేఖ. వాళ్లు వరంగల్ నుంచి చెన్నైకి తరలివెళ్లారు. నేను చెన్నైలో ఉన్నప్పట్నుంచీ ఆమె తెలుసు. సినిమా రంగంలో డాన్సర్‌గా చేసి, హైదరాబాద్ వచ్చేశారు. ఆమెకు ఇక్కడ పొలాలవీ ఉన్నాయ్. మంచి హెల్పింగ్ నేచర్. వాళ్ల తాతగారు కూడా నాకు బాగా సన్నిహితం. వాళ్లకు ఏ సమస్య వచ్చినా నేను వెళ్తున్నా. నాకే సమస్య వచ్చినా వాళ్లుంటారు. నేను షూటింగ్‌లో ఉంటే లొకేషన్‌కు భోజనం కూడా పంపిస్తుంటారు. నేను చాలా హ్యాపీ. ఎనిమిదేళ్ల నుంచీ నేను ఫ్యామిలీ లైఫ్‌కు దూరంగా ఉంటున్నా. పిల్లల్ని నేను బాగానే చూసుకున్నా. వాళ్లిప్పుడు సెటిలైపోయారు. నా భార్య విజయవాడలో ఉంటుంది. మా మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయ్. కోర్టులో నడుస్తున్నాయ్. ఇప్పుడు నా పక్కన దాసరి పద్మరేఖ ఉన్నారు." అని వివరించారు పృథ్వీ.